సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

కరోనా వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. పెద్ద ఎత్తున కరోనా నివారణ చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు.

మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సిఎంఆర్ఎఫ్ కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మెగా గ్రూప్ కు ధన్యవాదాలు తెలిపారు.

శాంతా బయోటెక్స్ అధినేత, పద్మభూషణ్ కెఐ వరప్రసాద్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలుసుకుని, ప్రభుత్వ కృషిని అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగత సహాయంగా కోటి 116 రూపాయల చెక్కును అందజేశారు.

కెఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహారెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. తమ కంపెనీ తరుఫున కోటి రూపాయల చెక్కును సిఎంఆర్ఎఫ్ కు అందించారు.

లారస్ ల్యాబ్స్ సిఇఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి.. ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సిఎంఆర్ఎఫ్ కు రూ.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

కరోనా వ్యాప్తి జరగుకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలకడంతో పాటు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్పూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందన్నారు.