సామాజిక దూరానికి రైల్వేస్‌ చేయూత

దేశవ్యాప్తంగా కరోనా విజృంభన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు రైల్వేస్‌ తనవంతు చేయూతను అందిస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను  రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆపత్కాలంలో సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో రైల్వేకు చెందిన ఖాళీ ప్రదేశాలను, మైదానాలను కూరగాయల మార్కెట్లు నిర్వహించేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణార్థం అదేవిధంగా రైల్వే సిబ్బంది రక్షణార్థం ఈ చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. డబ్బాలు డబ్బాలుగా ముగ్గుతో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకరికొకరు కనీసం మీటరు దూరం పాటిస్తూ కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు.