భారత్-సౌతాఫ్రికా తొలి వన్డే రద్దు

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షార్పణం అయింది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డేకు వరుణుడు పదే పదే అడ్డంకిగా మారడంతో టాస్‌ వేయకుండానే వన్డేను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత వర్షం తగ్గడంతో 50 ఓవర్ల మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్ర సమయంలో వర్షం కాస్త తెరిపిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను నిర్వహించడానికి వీలు లేకుండా మారిపోయింది. ఇక  ఆదివారం లక్నో వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది.

కరోనా ఎఫెక్ట్‌తో సౌతాఫ్రికాతో జరగనున్న మిగతా రెండు వన్డేల మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య గణనీయకంగా తగ్గిపోయింది. ఈ ప్రభావం మిగతా మ్యాచ్‌లపై కూడా పడే అవకాశం ఉంది. ఇది ఇలానే కొనసాగితే ఐపీఎల్‌ మ్యాచ్‌లను కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించే అవకాశాలున్నాయి.