భవన నిర్మాణదారుల అసోసియేషన్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణ ప్రభుత్వం అందించిన చేయూతతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అయితే కరోనా పరిస్థితులతో పలు భవనాల నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ భవన్ నిర్మాణదారుల అసోసియేషన్లతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వేలాది మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలలో నుండి హైదరాబాద్ కు వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాక్ డౌన్ సందర్భంలో వారి బాగోగులు చూడవలసిన కనీస బాధ్యత భవన నిర్మాణ యజమానులపైన ఉంటుందన్నారు. కార్మికుల్లో ఆత్మవిశ్వసం కలిగించే విధంగా, భవన నిర్మాణ యజమానులు చర్యలు తీసుకోవాలన్నారు. వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలని భవన నిర్మాణదారుల అసోసియేషన్లను కోరారు మంత్రి కేటీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల మూలంగా రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భవన నిర్మాణాదారులకు కూడా అభివృద్ది ఫలాలు అందాయని గుర్తుచేశారు. ప్రస్తుత ఆపత్కాలంలో నిర్మాణ కార్మికులకు బిల్డర్ల తోడ్పాటు అవసరమని చెప్పారు. కార్మికులకు కావలసిన వంట సరుకులు, ఇతర అవసరాలను భవన నిర్మాణ యజమానులు అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న సైట్లలో పనిచేస్తున్న కార్మికుల బాగోగులు, వారి అవసరాలు, సమస్యల పైన క్షేత్ర స్థాయిలో టీంలను ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కార్మికులకు కనీస అవసర సరుకులు, భోజన సదుపాయాలు అందించేందుకు భవన నిర్మాణ యజమానులకు కావలసిన అనుమతులను ఇవ్వాలన్నారు. అందులో భాగంగా డిజీపి, సైబరాబాద్, రాచకొండ, సిటీ పోలీస్ కమిషనర్ల తో ఫోన్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ విషయం లో సిసిపి మరియు డైరెక్టర్ డిసాస్టర్ మేనేజ్మెంట్ సెల్ వారు సమన్వయం చేసుకుంటారని చెప్పారు.

కార్మికుల సంక్షేమాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే కాంట్రాక్టు, రోజువారీ కూలీలకు వేతనాలు, కూలీలు చెల్లించాలని ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు. ఒక వేళ ప్రభుత్వనిబంధనలను అతిక్రమిస్తే, అయా బిల్డర్లపైన చట్ట రీత్యా చర్యలకు వెనకాడమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

అటు భవన నిర్మాణ యజమానులు సీఆర్‌ఎస్‌ నిధులతో ముందుకురావాలని మంత్రి కేటీఆర్  కోరిన వెంటనే పలువురు బిల్డర్లు విరాళాలు అందించారు. క్రెడాయ్ హైదరాబాద్ రూ.కోటి రూపాయలు, మీనాక్షి ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కోటి రూపాయలు, హైదరాబాద్ పుట్ బాల్ క్లబ్ సహ యజమాని విజయ్ మద్దూరి రూ.25 లక్షలు, తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ తరపున చైర్మన్ లోక భూమారెడ్డి రూ.5 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కేటీఆర్ కు అందజేశారు. కరోనా కోసం పనిచేస్తున్న సిబ్బంది కోసం 4 వేల N95 మాస్కులను జీపీకే ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్  తరపున శైలజా, ఫణికుమార్ అందచేశారు. ఈ ఆపత్కాలంలో విరాళాలతో ముందుకు వచ్చిన వారికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వివిధ భవన నిర్మాణ యాజమాన్య సంఘాల ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.