ప్రముఖ బాలీవుడ్ గాయనికి కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కోవిడ్ -19 ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లనుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. దీని ప్రభావం తాజాగా భారత్‌లోనూ తీవ్రమైంది. ఇప్పటివరకు దేశంలో 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఐదుగురు మరణించారు. ఇప్పటికే అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేశారు. సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు తాత్కాలిక విరామం ఇచ్చి చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.

తాజాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్‌ కు కరోనా సోకినట్లు తెలిసింది. కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. హిందీలో ఎన్నో ఉత్తమ పాటలు ఆమె పాడారు. ‘బేబి డాల్‌, చిట్టియాన్‌ కలైయాన్‌’ వంటి హిట్‌ సాంగ్స్‌ ను ఆలపించారు. అయితే కాగా కొంతకాలం లండన్‌లో ఉన్న కనికా మార్చి 15న లక్నోకు తిరిగి వచ్చారు. లక్నో చేరుకున్న తరువాత కనికా తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. అనంతరం కనికా లక్నోలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. అయితే శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌ తేలినట్లు అధికారులు వెల్లడించారు. అందులో గాయని కనికా ఒకరు. ప్రస్తుతం ఆమెను ​లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు. కనికా కపూర్ ఇచ్చిన పార్టీకి బీజేపీ ఎంపీ దుష్యంత్ వసుంధరాజే హాజరవడంతో… ప్రస్తుతం ఆయన స్వీయ నిర్భందంలోకి వెళ్లారు.