కేజీఎఫ్‌2 రిలీజ్‌ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

దేశ వ్యాప్తంగా కేజీఎఫ్‌2 కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ చాప్టర్ 1 చిత్రం దేశవ్యాప్తంగా ఐదు భాషాల్లో విడుదలై.. ఘన విజయం సాధించింది ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్2 ను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్‌ 23, 2020న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరో యశ్‌కు జంటగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ ప్రతినాయకుడు అధీర పాత్రలో కనిపించనున్నారు. ప్రధానిగా రవీనా టాండన్ నటిస్తుండగా, మరో కీలక పాత్రలో రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.