కరోనా.. మరింత అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అలర్ట్ అయ్యింది. ఇప్పటికే ముందు జాగ్రత్త  చర్యలను చేపట్టిన సర్కార్.. కరోనా పాజిటివ్ కేసులు 18కి పెరగడంతో నివారణ చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే 16 కేసులు నమోదు కాగా.. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇప్పటికీ తెలంగాణలోఉన్న వాళ్లకు ఎవరికీ కరోనా రాలేదు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వచ్చింది. ఈ నేపథ్యంలోకరోనాను ఎదుర్కునేందుకు అన్నిరకాల ప్రణాళికలకు ప్రభుత్వం సిద్ధంచేసింది. తెలంగాణలో ఆరు కరోనా ల్యాబ్ లు ఏర్పాటయ్యాయి. విదేశాల నుంచి వచ్చేవారితోనే కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో కట్టడి కోసం ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులను గుర్తించిన వెంటనే వారిని వైద్యశాలలకు తరలించేందుకు 20 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. దీంతోపాటుగా రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలోనూ కరోనా అనుమానితులను తరలించేందుకు ఒకటి చొప్పున అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. కరోనా అనుమానితుల సమాచారం అందిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుని దవాఖానలకు తరలిస్తున్నారు.

ఇప్పటివరకు తెలంగాణలో పాజిటివ్ గా తేలిన వారందరూ బాగానే ఉన్నారు. వాళ్లకెవరికీ ప్రాణాపాయం లేదు. వాళ్లందరికీ సర్కార్ క్వారంటైన్ లోఉంచి మెరుగైన చికిత్సను అందిస్తోంది. అటు.. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరికి వారు స్వీయ రక్షణచర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది జనం ఇంటికే పరిమితమయ్యారు. అత్యవరసమైతే తప్ప బయటకు రావడంలేదు. దీంతో.. రోడ్లన్నీ దాదాపు ఖాళీగానే కనిపిస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో డాక్టర్ల పాత్ర కీలకంగా మారిందన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌. కరోనా అనుమానితులకు మన వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. అటు.. మంత్రి ఈటెల విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్క్రీనింగ్, క్వారెంటైన్‌ విభాగాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ ను మెడికల్ జేఏసీ కలిసింది. కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్న ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని కోరింది. ఐసోలేషన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్లకు ట్రాన్స్పోర్ట్  ఫెసిలిటీ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వారి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి N-95 మాస్కులను అందజేసింది.

కరోనా నియంత్రణకు జీహెచ్ఎంసీ అన్ని చర్యలు చేపడుతున్నది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్ పలుచోట్ల స్ప్రేయింగ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో ఎంటమాలజి విభాగానికి 125 స్ప్రేయింగ్ యూనిట్స్ వున్నాయి. 150 వార్డులలో అవసరమైన చోట  స్పెషల్ శానిటేషన్ స్ప్రేయింగ్ లో పాల్గొనేందుకు ఈ యూనిట్స్ సిద్ధంగా వున్నాయి. ప్రతి యూనిట్ లో 18 మంది సిబ్బంది వున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి, ఇవిడిఎం విభాగం నుంచి శిక్షణ పొందిన 300 మంది సిబ్బంది పలుచోట్ల సోడియం హైపో క్లోరైడ్ స్ప్రేయింగ్ చేపట్టారు. విదేశాలనుండి వచ్చిన భారతీయులు, విదేశీయుల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది.. మొత్తం సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. వారు సెల్ఫ్ క్వారెంటైన్ అయ్యారా, లేదా, ఆరోగ్యస్థితి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. సెల్ఫ్ క్వారెంటైన్ జరిగిన ఇండ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు, కరోనా పాజిటివ్ కేసులు గుర్తించిన ప్రాంతాలు,  ప్రభుత్వం క్వారెంటైన్ చేసిన ప్రాంతం, దాని పరిసరాలలో జీహెచ్ఎంసీ సిబ్బంది క్రిమి సంహారకాలను స్ప్రే చేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్‌ చేయాలి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా శనివారం జరగాల్సిన పదో తరగతి పరీక్ష యథాతథంగా నిర్వహించాలని న్యాయస్థానం పేర్కొన్నది.

కరోనా  నేపథ్యంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లు నిర్వాహకులు శానిటేషన్‌ చర్యలు చేపట్టారు. కార్మికులకు థర్మల్‌  స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు మిల్లు పరిసరాలను రసాయనాలతో శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జేకే మిల్లు యాజమాన్యం తెలిపింది.

కరోనా వైరస్ ఎఫెక్ట్ దేవాలయాలపై పడింది. కరోనా నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రాన్ని ఆలయ అధికారుల మూసేశారు. వేల సంఖ్యలో భక్తులు ఒకదగ్గర చేరితే వైరస్ వ్యాప్తి చేందే అవకాశం ఉంటుందని ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఆలయంలో ప్రవేశాన్ని నిలిపేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కాకుండా విదేశాల నుంచి ఎవరైనా వస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. బస్సుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు… కుటుంబసభ్యుల మధ్య మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వధూవరులు మాస్కులు పెట్టుకొని మరీ.. కరోనాను ఎదుర్కోవడానికి అందరూ అప్రమత్తంగా ఉండాలని చాటిచెబుతున్నారు.