కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం

కరోనా వ్యాప్తి, రాష్ట్రాలు తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్రమంత్రి హర్షవర్ధన్ అన్నీ విభాగాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 30 దాటాయి. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన కరోనాపై రివ్యూ సమావేశం జరిగింది. ఈసమావేశంలో అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్రలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబయిలో ముగ్గురు, నవీ ముంబయిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరించారు అధికారులు. ఒడిశాలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి భువనేశ్వర్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధరాణ అయింది.  మహారాష్ట్ర తర్వాత కేరళలో అత్యధికంగా 22 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక చర్యలను చేపట్టారు. మార్చి 31 వరకు ఢిల్లీలోని అన్ని జిమ్‌ సెంటర్లు, పబ్బులు, మసాజ్‌ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే దేశ రాజధానిలో నిరసనలకు వేదికగా నిలిచిన షాహిన్‌ భాగ్‌ లో సైతం ఆంక్షలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఎక్కడా కూడా 50 మందికిపైగా ప్రజలు గుమికూడి ఉండొద్దని తెలిపారు. వివాహాలు, వేడుకలు కూడా కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న నేషనల్ డిఫెన్స్ కాలేజీకి ఈనెల 31వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. నేపాల్ సరిహద్దులో 49 స్ర్కీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని బీహర్ సీఎం నితీశ్‌ కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. కరోనా వ్యాధిసోకినవారికి సీఎం సహాయనిధి నుంచి చికిత్స అందిస్తామని తెలిపారు. కరోనాతో మరణించిన వారి కుటుంబానికి 4 లక్షల రూపాయలు సీఎం సహాయనిధి అందజేస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. కోర్టుకు వచ్చేవారికి సుప్రీంకోర్టుల్లో స్ర్కీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణ ఉంటేనే కోర్టుకు హాజరుకావాలని కోరింది. ముఖ్యమైన కేసులైతేనే వాదించేందుకు తీసుకోవాలని సూచించింది. ఈనెల 31 వరకు  ముఖ్యమైన కేసుల విచారణ మాత్రమే ఉంటుందని బార్ కౌన్సిల్ తెలిపింది. సిమ్లాలో ఈనెల 31 వరకు ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సచివాలయ ఉద్యోగులకు మమత సర్కార్ శానిటైజర్లను పంపిణీ చేసింది. ఉన్నతాధికారులతో మమత బెనర్జీ కరోనా పై రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఈనెల 31వరకు స్కూళ్లు, కాలేజీలకు మేఘాలయ,అసోం, త్రిపుర రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. వైద్యవిభాగంలో పనిచేస్తోన్న అందరికి సెలవులను రద్దు చేస్తున్నట్లు చండీగఢ్ ఆదేశాలు జారీచేసింది. దాదాపు అన్నీ రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలకు సెలవులు ప్రకటించాయి.