కరోనా ఎఫెక్ట్… ఇంటర్నెట్‌ కు కష్టాలు

కరోనా నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. సినిమా థియేటర్లు, మాల్స్‌ మూతపడ్డాయి. వినోదం కోసం ప్రజలు ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. భారతదేశంలో 22.26 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఉన్నారు. అకస్మాత్తుగా దేశంలో డేటా వినియోగం పెరిగిందని, డిమాండ్‌కు తగిన విధంగా సేవలు అందించేందుకు ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్‌డీ వీడియోలు, వీడియో కాల్స్‌ కు అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే బ్రాడ్‌బాండ్‌ రంగంలో స్పెక్ట్రం కొరత, తక్కువ ఫైబరైజేషన్‌, పేలవమైన వైర్లతో మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయి. డేటా వినియోగం అకస్మాత్తుగా పెరగడంతో మౌలిక సదుపాయాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.