కరోనాపై పోరుకు పవన్ రూ.2కోట్ల విరాళం

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు, ప్రధానమంత్రి సహాయనిధికి భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయ నిధులకు 50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందిస్తానని చెప్పారు. భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు పవన్ ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వం కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.