ఉగాదికి మెగాస్టార్‌ చిరు కానుక ఇదే..

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు ఉగాది కానుకగా ఒక శుభవార్త తీసుకొచ్చారు. ఉగాది నుంచి ఆయన అభిమానులో అందుబాటులో ఉంటున్నారు. అంటే బుధవారం నుంచి ఆయన కూడా సోషల్ మీడియాలో సందడి చేయబోతున్నారు. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా తెలిపింది. మెగాస్టార్‌ మాట్లాడుతున్న వీడియో సందేశాన్ని పంపుతూ.. ఈ ఉగాది ఎంతో ప్రత్యేకం కాబోతుంది. మీ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో ఖాతాల ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. ఆయనను ఫాలో అవడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మెగాస్టార్‌ మాట్లాడిన విషయాలు…

‘’ఇక నుంచి నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ అవుదామనుకుంటున్నాను. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాల్ని నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి, అలాగే నేను అనుకున్న సందేశాలు గానీ, చెప్పాలనుకున్నవి గానీ.. ప్రజలతోటి చెప్పుకోవడానికి అది వేదికగా భావిస్తూ.. నేను ఇక మీదట సోషల్ మీడియాలోకి ఏంట్రీ అవుతున్నాను అదీ ఈ ఉగాది రోజు నుంచి’’ అని అన్నారు.

కాగా.. చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. సినిమాలో కాజల్ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.