ఆర్‌ఆర్‌ఆర్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

సినీ అభిమానులకు దర్శక దిగ్గజం రాజమౌళి ఉగాదికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్‌ఆర్‌ చిత్ర లోగోను విడుదల చేశారు. ‘రౌద్రం, రణం, రుధిరం’ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ ను సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. రామ్‌ చరణ్‌ కు జంటగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్‌ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్‌ తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది 2021 జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.