భీమా-కోరేగావ్‌ కేసు కేంద్రానికి ఇవ్వలేదు :ఉద్దవ్ ఠాక్రే

పలు విషయాల్లో మహా వికాస్‌ ఆఘాడీ కూటమి సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టతనిచ్చారు. భీమా-కోరేగావ్‌ కేసును ఎన్‌ఐఏకి అప్పగించిన వార్తలు రావడం, దానిపై కాంగ్రెస్‌, ఎన్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ అయ్యారు. ఈ పరిణామాల తర్వాత మంగళవారం మీడియాతో మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

భీమా-కోరేగావ్‌, ఎల్గార్‌ పరిషత్‌ కేసులు రెండు వేరువేరని ఆయన వెల్లడించారు. దళిత సోదరులకు సంబంధించినదని.. ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఈ కేసును ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించలేదన్నారు. కేవలం ఎల్గార్ పరిషత్‌ కేసు మాత్రమే ఎన్‌ఐఏకి బదిలీ అయిందని చెప్పుకొచ్చారు. ఇక ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ వేరువేరు అంశాలన్నారు. సీఏఏ అమలైనా ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్‌సీని మాత్రం రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ ఎన్‌ఆర్‌సీ అమలైతే.. హిందూ, ముస్లింలతో పాటు ఆదివాసీలపైనా ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్‌పీర్‌ కేవలం పది సంవత్సరాలకు ఒకసారి జరిగే సెన్సెస్‌ ప్రక్రియ మాత్రమేనని అన్నారు. దీని వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదని అభిప్రాయపడ్డారు.

సీఏఏపై ఉద్ధవ్‌ ఠాక్రే అభిప్రాయంతో శరద్‌ పవార్‌ విభేదించారు. సీఏఏ అమలైనా చింతించాల్సిన అవసరం లేదనడం ఉద్ధవ్‌ వ్యక్తిగత అభిప్రాయమని.. ఎన్సీపీ మాత్రం సీఏఏకి వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తుచేశారు.