`అరణ్య` మూవీ నుంచి విష్ణు విశాల్‌ లుక్‌…

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అరణ్య. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మాణ సారథ్యంలో… దర్శకుడు ప్రభు సాల్మన్‌ తెరకెక్కించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో ‘హాథీ మేరా సాథీ’, తమిళంలో ‘కాదన్’ పేరుతో రిలీజ్‌ చేయనున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్లను చిత్ర బృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రానా, ఇతర ముఖ్యతారాగణం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతో పాటు టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో రానా అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా క‌నిపించ‌నున్నాడు. జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ముఖ్యపాత్రల్లో నటించారు.

తాజాగా, టీజర్‌ సోషల్ మీడియలో హల్‌చల్‌ చేస్తుండగానే… ఈ సినిమాలో విష్ణు విశాల్‌కు చెందిన మరో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో విష్ణు విశాల్‌ ఏనుగుతో క‌లిసి దిగిన ఫోటోని విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా… మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది.