అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్: భారత్ -177 ఆలౌట్

పోచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యింది. భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ పోరులో యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. క్లిష్టపరిస్థితుల్లో అద్వితీయ ఆటతో మరోసారి ఆకట్టుకున్నాడు. యశస్వి(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్‌) అర్ధశతకంతో రాణించడంతో యువ భారత్‌ మెరుగైన స్కోరు చేసింది. ఆరంభంలో తిలక్‌వర్మ(38: 65 బంతుల్లో 3ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో ధ్రేవ్‌ జురేల్‌(22) అనూహ్యంగా రనౌట్‌ కావడంతో భారత్‌ మంచి స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు సంచలన ఆటతీరుతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఆఖరి వరకు బౌలర్లు క్రమశిక్షణతో బంతులేసి టీమ్‌ఇండియా స్కోరు వేగానికి కళ్లెం వేశారు. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌(3/40), ఇస్లాం(2/31), హసన్‌ షకీబ్‌(2/28) భారత్‌ను భారీ దెబ్బకొట్టారు.