డీసీసీబీ, డీసీఎంస్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్…

డీసీసీబీ, డీసీఎంస్ డైరెక్టర్ల ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. నల్గొండ మినహా.. అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు టీఆర్ఎస్ మద్దతుదారులకే దక్కాయి. తొమ్మిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, తొమ్మిది జిల్లా కోఆపరేటీవ్ మార్కెటింగ్ సంస్థల డైరెక్టర్ల పదవుల్లో ఎనిమిది ఏకగ్రీవమయ్యాయి. ఇక 29న డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారు. 29న ఉదయం చైర్మన్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.

డిసీసీబీ, డీసీఎఎస్ డైరెక్టర్ల ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, తొమ్మిది జిల్లా కోఆపరేటీవ్ మార్కెటింగ్ సంస్థల డైరెక్టర్ల పదవుల్లో నల్గొండ మినహా… ఎనిమిది డైరెక్టర్ల పదవులు గులాబీ మద్దతుదార్లకే దక్కాయి. ఒక్కో డీసీసీబీలో 20, డీసీఎంఎస్ లో 10 చొప్పున డైరెక్టర్ పదవుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి.. నామినేషన్లు స్వీకరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు.. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉపసంహరణకు అవకాశమిచ్చారు. కొన్ని చోట్ల డైరెక్టర్ పదవికి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేసినప్పటికి.. ఉపసంహరణ గడువు ముగిసేసరికి అన్ని చోట్లా ఒక్కొక్కరే పోటీలో మిగిలారు. తొమ్మిది డీసీసీబీలలో మొత్తం 180 డైరెక్టర్ పదవులుండగా.. 147 పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. దీంతో డీసీసీబీలలో147 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. అటు తొమ్మిది డీసీఎంఎస్ లలో మొత్తం 90 డైరెక్టర్ పోస్టులకు నామినేషన్లు స్వీకరించగా..74 పోస్టులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డీసీఎంఎస్ లలో74 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు.

డీసీసీబీ, డీసీఎంఎస్ ఆఫీస్ బేరర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవుల ఎన్నిక ఈ నెల 29న జరగనుంది. అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేసి..అదే రోజు ఎన్నిక నిర్వహించనున్నారు. మరోవైపు తొమ్మిది డీసీసీబీలలోని 33 రిజర్వుడ్ స్థానాల్లో..ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అటు రిజర్వేషన్ కాటగిరీలోని మరో 16 డీసీఎంఎస్ డైరెక్టర్ల పదవులకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో ఆయా డైరెక్టర్ల ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.