తెలంగాణను కించపరిచేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు…

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణపై అవమానకరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత నకిలీవంటే.. చిన్నపిల్లాడినడిగినా చెబుతారు తెలంగాణలో రైల్వే వ్యవస్థ ఎప్పటినుంచి ఉందో. ఢిల్లీ పెద్దల మెప్పు పొందటానికి కావాలని మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో గానీ ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమాన పరిచేవిగా ఉన్నాయి. మోదీ వచ్చేదాక తెలంగాణ ప్రజలకు అసలు రైలు అంటేనే తెలియదని అవహేళనగా మాట్లాడారు. మోదీ దయవల్లే తెలంగాణ ప్రజలకు రైలు అంటే ఎంటో తెలిసిందని, అంతకు ముందు ఎర్రబస్సే దిక్కని ఎగతాళిగా మాట్లాడారు. చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పైవిధంగా కామెంట్స్‌ చేశారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణవాసులు మండిపడుతున్నారు.

తెలంగాణ రైల్వేకు 150 సంవత్సరాల ఘనచరిత్ర…

తెలంగాణ రైల్వేకు 150 సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. 1870లోనే నిజాం స్టేట్ గ్యారెంటీడ్ రైల్వే పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్ పోర్టు వ్యవస్థ ఏర్పడింది. దేశంలోనే సొంత ధనంతో.. రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది హైదరాబాద్ ఒక్కటే. 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, ఖాజీపేట రైల్వే స్టేషన్లు అన్నీ నిజాం కాలంలో నిర్మించినవే. 1966 నుంచి నిజాం స్టేట్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వేగా మారింది.

ఇంత ఘనచరిత్ర ఉన్న తెలంగాణ రైల్వే గురించి కిషన్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నిజం చెప్పాలంటే మోదీ పాలనలో రైల్వే రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఒక్క కొత్త లైన్ లేదు. కొత్త ప్రాజెక్టు లేదు. ఇంత అన్యాయం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రైల్వే బడ్జెట్ ప్రాధాన్యం తగ్గించి.. కేంద్ర బడ్జెట్‌లో కలిపేయటం వల్ల మరింత నష్టం జరిగింది. దేశంలో ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం తెలంగాణే. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న విశాఖను కొత్త రైల్వే జోన్ చేసి… మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. విజయవాడ, గుంతకల్లుతో పాటు ఇంకొన్ని ఏరియాలను సికింద్రాబాద్ నుంచి తప్పించింది. సికింద్రాబాద్ ఆదాయానికి గండికొట్టింది. విభజన చట్టంలో… ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు. అదీ ఇప్పటిదాకా దిక్కులేదు. కాజీపేట డివిజన్ హోదా కావాలని టీఆర్ఎస్ ఎంపీలు పదులసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్తపల్లి-మనోహరాబాద్, మెదక్- అక్కన్నపేట రైల్వే లైన్లకు రాష్ట్ర ప్రభుత్వమే భూమిని సేకరించి, సగం ఖర్చు భరిస్తోంది. గతంలోనే మంజూరైన మణుగూరు- రామగుండం, భద్రాచలం- కొవ్వూరు, కొత్తగూడెం- కొండపల్లి రైల్వే లైన్లకు ఐదేళ్లుగా నిధులేలేవు. ఆదిలాబాద్- ఆర్మూరు రైల్వే లైన్ 2017 బడ్జెట్‌లో మంజూరైనట్లు ప్రకటించారు. ఆతర్వాత అది జాడ లేదు. రూ. 430 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఘట్ కేసర్- యాదాద్రి ఎంఎంటీఎస్ రైల్ మూడేండ్లుగా ముందుకు సాగటంలేదు. ఇవి చాలు రైల్వే రంగంలో తెలంగాణకు మోదీ సర్కార్ ఎంత అన్యాయం చేసిందో తెలుసుకోవటానికి. ఇవన్నీ తెలిసికూడా తెలంగాణకు మోదీ ఏదో చేసిండని కిషన్ రెడ్డి చెప్పటం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం.