ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కీలక తీర్పు…!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ అమెండ్‌మెంట్ యాక్ట్-2018ను దేశ అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆ కేసుల్లో సీనియర్ ఆఫీసర్లు ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండానే ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. దీనిపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

అయితే… ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని, కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ నాలుగేళ్ల కింద సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీంకోర్టు విచారించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతుందన్న వాదనను సమర్థించిన ధర్మాసనం… 2018లో పలు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దాని కింద వచ్చే ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు మెరిట్‌ను బట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని పేర్కొంది.

కాగా… సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని, దానిని మరోసారి పరిశీలించాలని కోరుతూ… పెద్ద ఎత్తున రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ తీర్పును రివ్యూ చేయాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరింది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టానికి సవరణలు చేసింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్… సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలతో… 2018లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, అరెస్టులు చేయడం వద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దవుతోంది.