జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు…

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీ నిర్బంధంపై.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి అయిన మహబూబాను గృహ నిర్భందంతో పాటు ఆమెపై ప్రజా భద్రతా చట్టం` కింద కేసు నమోదు చేయడంపై వివరణ కోరింది. ముఫ్తీ నిర్బంధం, పీఎస్‌ఏ కేసు నమోదును సవాల్ చేస్తూ… ఆమె కూతురు ఇల్తీజా ముఫ్తీ సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి మెహబూబాపై గృహ నిర్బంధం విధించారు. ఆరు నెలల గృహ నిర్బంధం ఈ నెల ఐదో తేదీతో ముగియడంతో… ఆమెపై ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) ప్రయోగించారు. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా మరో మూడు నెలల నుంచి ఏడాది వరకు నిర్బంధంలో ఉంచే అధికారం ఉంటుంది.

అయితే, కుట్ర పూరితంగా తన తల్లిని నిర్బంధించారని ఇల్తిజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఫ్తీపై పీఎస్‌ఏ విధించడానికి ప్రభుత్వం చూపుతున్న కారణాలు కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. పచ్చ రంగులో ఉన్న పార్టీ జెండా, తండ్రి అడుగు జాడల్లో నడవడం, సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లను కారణంగా చూపారని ఇల్తిజా ముఫ్తీ తెలిపారు. దీనిపై సమాధానం చెప్పాలని… జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. జమ్మూ కశ్మీర్ పాలకులను కోరింది. అలాగే, తన తల్లి నిర్బంధాన్ని సవాల్ చేస్తూ మరే కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయకూడదని ఇల్తిజా నుంచి ప్రమాణ పత్రం కోరింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. జమ్ముకాశ్మీర్‌ మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి నిర్బంధంలోనే ఉన్నారు. కాగా.. ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో పెండింగ్‌లోనే ఉంది.