పక్కా పథకం ప్రకారమే ఢిల్లీ అల్లర్లు :సోనియా గాంధీ

ఈశాన్య ఢిల్లీ అల్లర్లు పక్కా పథకం ప్రకారమే జరుగుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. అల్లర్ల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ నేతల రొచ్చగొట్టే ప్రసంగాల వల్లే అల్లర్లు మొదలయ్యాయని అన్నారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను ఖండించారు. బుధవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై.. ఢిల్లీ అల్లర్లపై చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో అల్లర్ల ఘటనలు బాధాకరమని ఆమె అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కుడున్నారని ప్రశ్నించిన సోనియా… అల్లర్లను అదుపుచేయడంలో కేంద్రహోంశాఖ విఫలమైందన్నారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మూడు రోజుల ఆందోళనలో పదుల సంఖ్యలో మృతి చెందడం బాధాకరమన్నారు సోనియా గాంధీ. కొంత మంది బుల్లెట్‌ గాయాలతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసు బలగాలను మోహరించడంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం వహించిందని… అల్లర్లు జరగడంలో ఢిల్లీ సీఎం వైఫల్యం కూడా ఉందన్నారు. అల్లర్లకు నిరసనగా రేపు రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇక.. ఢిల్లీ ప్రజలు సంయమనం పాటించాలని ప్రజలను సోనియా గాంధీ కోరారు.