1984 అల్లర్లు పునరావృతం కావొద్దు :ఢిల్లీ హైకోర్టు

దేశ రాజధానిలో 1984 నాటి తరహాలో అల్లర్లు పునరావృతం కావొద్దు అని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. పూర్తి స్థాయిలో పౌరులకు భద్రత కల్పించాలని… ప్రభావిత ప్రాంతాలను ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సందర్శించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్క బాధితుడి వద్దకు చేరుకోవాల్సిన సమయం ఇది అని కోర్టు తెలిపింది. ప్రతి ఒక్కరికి జడ్‌ సెక్యూరిటీలా రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై హైకోర్టులో బుధవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ అల్లర్ల ఘటనపై ఉదయం పోలీసులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు… విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరుకావాలని ఆదేశించింది. మధ్యాహ్నం పోలీసు ఉన్నతాధికారులు హాజరవడంతో… కోర్టులో విచారణ జరిగింది.

విచారణ సందర్భంగా పోలీసులకు పలు సూచన చేసింది. అల్లర్లలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది. గాయపడిన బాధితులు, వారి కుటుంబాలను, మృతుల కుటుంబ సభ్యులను ఉన్నతాధికారులు పరామర్శించాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అటు… అల్లర్లకు భయపడి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి భయపడితే, వారికి షెల్టర్లు ఇవ్వాలని ఆదేశించింది. షెల్టర్లలో బాధితులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని చెప్పింది. మృతుల కుటుంబాలతో మాట్లాడి అంత్యక్రియలు సజావుగా సాగేలా చూడాలన్న కోర్టు… హెల్ప్‌ లైన్లు, హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించింది. క్షతగాత్రుల వద్దకు అంబులెన్స్‌లు సురక్షితంగా చేరేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఐబీ ఆఫీసర్‌ మృతి చెందడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐబీ ఆఫీసర్‌ చనిపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అటు.. ఢిల్లీలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన పలువురు నేతల వీడియోలను హైకోర్టు పరిశీలిచింది.