ఛాలెంజ్ ఎదుర్కొన్న సచిన్: తొలి బంతి బౌండరీ

భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ తెందూల్కర్‌…! ఈ పేరు వింటేనే అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. అలాంటిది ఆరేళ్ల క్రితం పిచ్‌ను విడిచిన మాస్టర్ బ్లాస్టర్‌.. మరోసారి బ్యాట్‌ పట్టుకుని కనిపిస్తే.. అది కూడా తొలి బంతినే బౌండరీ దాటిస్తే! అభిమానుల ఫీలింగ్ చెప్పగలమా..? ఇప్పడు అదే జరిగింది. ఆరేళ్ల తర్వాత బ్యాట్‌ పట్టుకున్న క్రికెట్ లెజెండ్ సచిన్… వచ్చీరాగానే తొలి బంతినే బౌండరీ దాటించాడు. అయితే… బుష్‌ఫైర్‌ బాధితుల సహాయార్థం రికీ పాంటింగ్ ఎలెవన్‌ × గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్‌ జట్ల మధ్య ‘బిగ్‌ బాష్‌ ఫైర్‌’ మ్యాచ్‌ జరిగింది. పాంటింగ్‌ జట్టుకు సచిన్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. కాగా, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీస్‌ పెర్రీ సచిన్‌కు సరదాగా ఛాలెంజ్‌ విసిరింది. ఈ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ విరామంలో తన బౌలింగ్‌ను ఎదుర్కోవాలని సవాల్‌ చేసింది. సచిన్‌కు బౌలింగ్ చేయడం ఎంతో ఇష్టమని, అంతేకాక దీని వల్ల ఎక్కువ విరాళాలు వస్తాయని తెలిపింది.

ఇంకేముంది.. దీనికి `సై` అన్న సచిన్.. పాంటింగ్ జట్టు బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత మైదానంలో అడుగుపెట్టాడు. ఎలీస్‌ పెర్రీ వేసిన తొలి బంతినే.. ఫైన్‌లెగ్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. తర్వాతి బంతుల్ని డీప్‌ స్వేర్‌ లెగ్‌, షార్ట్‌ ఫైన్‌ లెగ్‌, మిడ్‌ ఆన్‌, కవర్స్‌ మీదుగా చూడముచ్చటైన షాట్స్‌తో అలరించాడు. సచిన్‌ బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత స్టేడియంలో ‘‘సచిన్‌ సచిన్‌..’’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. భారత్ తరఫున నవంబర్‌ 2013లో సచిన్ తుది టెస్టు మ్యాచ్‌ ఆడాడు.