ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం లోటే :కోచ్ రవిశాస్త్రి

గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమవ్వడం జట్టుపై ప్రభావం చూపిస్తుందని భారత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దాదాపు అయిదుగురు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారని ఆయన చెప్పాడు. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ గాయాల కారణంగా తప్పుకున్నారు. దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం లోటుగానే భావిస్తున్నామని తెలిపారు.

టెస్టుల్లో ఇషాంత్‌ శర్మ పనిభారం మోస్తూ జట్టుకు సానుకూలాంశంగా ఉంటాడని తెలిపాడు. న్యూజిలాండ్‌లో ఫాస్ట్ పిచ్‌లపై భువనేశ్వర్ అన్ని ఫార్మాట్లలో ఉపయోగపడేవాడని వివరించాడు. రోహిత్ శర్మదీ ఇదే పరిస్థితి అని, దురదృష్టవశాత్తు గాయపడి టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడని విచారం వ్యక్తం చేశాడు. అయితే, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా వంటి ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. గిల్, షాల్లో ఒకరు మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తారని వివరించారు. అయితే, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా మరికొన్నిరోజుల్లో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం మేనేజ్ మెంట్ ను కలవరానికి గురిచేస్తోంది.