‘నా తండ్రి దేశాన్ని నడిపిస్తున్నాడు’… ఇంట్రెస్టింగ్ వీడియో!

దేశాభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అవశ్యకమో.. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థను తెలిపే ఓ చిన్న నిడివి గల వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా నెజిజన్లతో పంచుకున్నారు. ముంబై నగరంలో 50వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, దుర్భర పరిస్థితుల్లో రోజు మొత్తం కష్టపడుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. మంత్రి కేటీఆర్‌ ఈ వీడియోను షేర్‌ చేస్తూ ప్రతిఒక్కరూ.. చివరి వరకకు చూడాల్సిందిగా కోరారు. ఇక నుంచి.. తడి, పొడి చెత్తను వేరుచేయడం ద్వారా మున్సిపల్ కార్మికులకు సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. వీడియోలో ఓ విద్యార్థి తన తండ్రి పని ప్రాముఖ్యాన్ని ఈ విధంగా తెలియజేస్తుంటాడు.

“నా తండ్రి దేశాన్ని నడిపిస్తున్నాడు. అతనేమీ నాయకుడు కాదు.. అయినా దేశాన్ని నడిపిస్తున్నాడు. నా తండ్రి డాక్టర్‌ కూడా కాదు.. కానీ రోగాల్ని దగ్గరికి రానీవ్వడు. నా తండ్రి పోలీస్‌ కాదు.. కానీ దేశంలోని చెడుని తీసేస్తాడు. ఆర్మీ కూడా కాదు.. కానీ దుష్టశక్తులపై పోరాడుతాడు. కానీ, మా నాన్న ఒక్క రోజు పనికి వెళ్లకపోతే మాత్రం దేశంలోని ప్రతీ ఇళ్లు ఆగిపోతుంది. ఇంట్లో అన్నం వండుకోలేరు. స్నానాలు ఉండవు. అందరూ వీధుల్లోనే ఆగిపోతారు. డాక్టర్లు ఆస్పత్రికి చేరుకోలేరు. విద్యార్థులు పాఠశాలలకు చేరుకోలేరు. మంత్రులు సచివాలయానికి పోలేరు. దేశం మొత్తం దిక్కులేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనందరి జీవితాల్ని సులభతరం చేస్తాడు మా నాన్న. ఎవరి తండ్రి చేయాలనుకోని పనిని మా నాన్న చేస్తాడు.“ అంటూ వీడియో కొనసాగుతుంది. పారిశుద్ధ్యంపై వచ్చిన ఈ వీడియో.. సగటు మనిషిని ఆలోచింపజేసేలా ఉంది.

ఇక… హైదరాబాద్‌ మహానగరంలో ప్రతిరోజు 4 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థపదార్థాలు వస్తున్నట్లుగా సమాచారం. అయితే… ప్లాస్టిక్‌ పదార్థాలతో, తడి, పొడి చెత్త కలయికల వ్యర్థాల తరలింపు అత్యంత సమస్యాత్మకంగా మారింది. దీంతో… తడి, పొడి చెత్తను వేరు చేయడం తమ తమ ఇంటి నుండే ప్రారంభం కావాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల నుండి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయడానికి ప్రతీ ఇంటికి రెండు డస్ట్‌బిన్‌లను అందజేసింది. అదేవిధంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా చేయడానికి అవగాహన నిమిత్తం స్వచ్ఛ వాలంటీర్లను ఏర్పాటు చేసింది.