తండ్రి బాటలో తనయుడు: రెండు నెలల్లో 2 డబుల్ సెంచరీలు…

రాహుల్ ద్రవిడ్‌..! టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌. ద్రవిడ్‌ బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగితే.. పరుగుల వరద పారేది. ద్రవిడ్‌ను ఔట్ చేయడానికి.. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఎంతో కష్టపడేవారు. ఇక, ఇప్పుడు ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ కూడా మళ్లీ ద్రవిడ్‌ను కళ్లముందు చూపిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యలా పరిణమించాడు. ప్రస్తుతం అండర్‌-14 టీమ్‌లో ఆడుతున్న సమిత్ ద్రవిడ్‌‌.. బ్యాటు ఝుళిపిస్తూ, సెంచరీల సునామీ సృష్టిస్తున్నాడు. భారీ సెంచరీలు సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. బ్యాటింగ్‌లోనే కాదు… బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు.

ప్రస్తుతం సమిత్ బెంగళూరులో జరిగే అండర్-14 లీగ్ మ్యాచ్ ల్లో రెండు డబుల్ సెంచరీలతో ఔరా అనిపించాడు. మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ కుమారన్ టీమ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మాల్యా అదితి స్కూల్ తరపున బరిలోకి దిగిన సమిత్ 33 ఫోర్లతో 204 పరుగులు సాధించాడు. మాల్యా టీమ్ 3 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది. లక్ష్య చేధనలో 267 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో సమిత్ బ్యాట్‌తోనే కాదు.. రెండు వికెట్లు పడగొట్టి బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా.. గత డిసెంబరులో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే రెచ్చిపోయాడు. బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా ఆడిన సమిత్… 22 ఫోర్లతో 201 పరుగులు చేశాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జూనియర్ ద్రావిడ్ ఇంతకుముందు కూడా సెంచరీల మీద సెంచరీలు బాది కర్ణాటక క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాడు.