భారత పర్యటనకు బయల్దేరిన ట్రంప్…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటన బయల్దేరారు. యూఎస్‌ ప్రథమ మహిళ, సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి బయల్దేరిన ట్రంప్‌… జర్మనీ మీదుగా సోమవారం ఉదయం 11.55 నిమిషాలకు అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. గుజరాత్, యూపీ, దిల్లీ ప్రాంతాల్లో… రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) ట్రంప్‌ పర్యటన కొనసాగనుంది.

ట్రంప్‌ పర్యటన షెడ్యూల్‌ ఇలా…

రేపు(సోమవారం) ఉదయం 11.55 గంటలకు అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్‌ చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు ర్యాలీగా వెళ్తారు. ఈ రోడ్‌షోలో భాగంగా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మోతేరా స్టేడియం చేరుకుని… అక్కడ జరిగే `నమస్తే ట్రంప్‌` కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3-30 గంటలకు ఆగ్రాకు బయల్దేరి వెళ్తారు. గం. 4.45 గంటలకు ఆగ్రాకు చేరుకుని… సా. 5-10 గంటలకు తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 6-45 గంటలకు ఆగ్రా నుంచి ఢిల్లీకి బయల్దేరి.. రాత్రి 7.30 గంటలకు పాలం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌ మౌర్యాకు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేస్తారు.

25న మంగళవారం ఉదయం 9-55 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు ట్రంప్ దంపతులు. రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 10.30 గంటలకు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. 11 గంటలకు హైదరాబాద్‌ హౌస్‌లో ట్రంప్‌, మోదీ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఇరు దేశాలకు సబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించి… ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి రాత్రి 7.25కు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని.. ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవిందుతో భేటీ అవుతారు. ఆ తర్వాత… రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి కోవింద్‌ ఇచ్చే విందులో ట్రంప్ దంపతులు పాల్గొంటారు. విందు ముగిసిన తర్వాత… రాత్రి 10 గంటలకు అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.