ఢిల్లీ అల్లర్లు: క్షేత్రస్థాయిలో పర్యటించిన అజిత్ దోవల్…

ఢిల్లీలో చెలరేగుతున్న హింసను కంట్రోల్ చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. అల్లర్ల అదుపుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రంగంలోకి దింపింది. అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధవారం అజిత్ దోవల్ పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించారు. అక్కడ పలువురు ప్రజలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన దోవల్‌కు ప్రజలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ… ఢిల్లీలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలు భద్రత పట్ల సంతృప్తికరంగానే ఉన్నారని తెలిపారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలపై పూర్తి విశ్వాసం ఉందని… పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, దోవల్ చెప్పిన అంశాలపై స్పందించిన పలువురు స్థానికులు… పోలీసులు సరిగ్గా డ్యూటీ చేస్తే ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని దోవల్‌ను నిలదీశారు. కాగా.. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు మృతిచెందని వారి సంఖ్య 23కు చేరింది.