`భీష్మ` ట్రైలర్: ప్రేమ కథే కాదు, రైతు కథ…!

నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన `భీష్మ` చిత్రం… షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 21న సినిమా విడుదలకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తూనే.. `భీష్మ` ట్రైలర్‌ను సోమవారం రోజు విడుదల చేసింది.

’దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమ ధర్మరాజ్, శని, శకుని.. ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు నాకు పెట్టారు.. దాని వల్లే నేమో ఒక్కరు కూడా పడట్లేదు..‘ అంటూ నితిన్ వాళ్ళ అమ్మతో అంటున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. అదే సమయంలో నితిన్‌కు రష్మిక మందన్న కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వీరి ప్రేమ ఇలా సాగుతున్న సమయంలో సడెన్‌గా కథ విత్తనాలు, రైతుల చుట్టూ నడుస్తుంది. “ ఎరువులు, పురుగు మందుల పేరుతో విషప్రయోగం జరుగుతోంది. ఆపేద్దాం..! సేంద్రీయ వ్యవసాయం వైపు మారిపోదాం“ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ నేపథ్యం వ్యవసాయం వైపు మారుతుంది. అనంతరం… ‘ సహజంగా పంట పండాలి అంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. కానీ, కొన్ని రకాల విత్తనాలను వేయడం, కొన్ని రకాల మందులు వాడటం వలన ఆరు నెలలో చేతికి రావాల్సిన పంట నాలుగు నెలల్లోనే చేతికి వస్తుంది’ అని విలన్ చెప్తాడు. ఈ డైలాగ్‌ చూస్తే… సినిమాలో రైతులకు సంబంధించిన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమాలోని నితిన్ పేరు ఒక్కటే భీష్మ కాదు, ఇందులో కొత్తరకం విత్తనాల పేర్లు కూడా… భీష్మ అని ఓ చోట చూపించారు. మొత్తానికి సినిమాను కేవలం లవ్ స్టోరీగా మాత్రమే కాకుండా.. రైతులకు సంబంధించిన అంశాలను కూడా టచ్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 21 వరకు వెయిట్ చేయాల్సిందే.