చివరి వన్డేలోనూ భారత్ ఓటమి, క్లీన్ స్వీప్ చేసిన కివీస్…

మౌంట్‌మాంగనీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలోనూ భారత్ ఓడిపోయింది. మూడో వన్డేలో టీమిండియాపై 5 వికెట్ల తేడాతో కివీస్‌ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టీ20 సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయగా.. న్యూజిలాండ్ జట్టు వన్డేల్లో వైట్‌వాష్ చేసి బదులు తీర్చుకుంది. బ్యాటింగ్‌కు అనువైన పిచ్‌గా చెప్పుకునే బే ఓవల్ పిచ్‌పై కివీస్ బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి ఆడడంతో… ఫైనల్ వన్డేలో గెలిచి పరువు దక్కించుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి.

తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ (112: 113 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) శతకంతో అదరగొట్టాడు. వన్డే కెరీర్‌లో రాహుల్‌కిది నాలుగో సెంచరీ కావడం విశేషం. తీవ్ర ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసంతో, ఎంతో పరిణతితో బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌ అద్భుత సెంచరీతో విజృంభించగా శ్రేయస్‌ అయ్యర్‌(62: 63 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. మొదట్లో పృథ్వీషా(40: 42 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు)తో పాటు మనీశ్‌ పాండే(42: 48 బంతుల్లో 2ఫోర్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడంతో నిర్ణీత ఓవర్లలో భారత్‌ 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో బెనెట్‌(4/64) ఈ మ్యాచ్‌లోనూ మళ్లీ భారత్‌ను ఇబ్బందిపెట్టాడు. జేమీసన్‌, జేమ్స్‌ నీషమ్‌ చెరో వికెట్‌ తీశారు.

గత రెండు వన్డేల మాదిరిగానే ఆఖరి మ్యాచ్‌లోనూ మయాంక్‌ అగర్వాల్‌ నిరాశపరిచాడు. పృథ్వీ షా కుదురుకున్నాక అనవసర పరుగు కోసం ప్రయత్నించి అనూహ్యంగా రనౌట్‌కావడం భారత్‌కు పెద్ద షాక్‌. గత రెండు మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులే చేసిన విరాట్‌ కోహ్లీ ఆఖరిదైన మూడో వన్డేలోనూ కేవలం 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. బెనెట్‌ బౌలింగ్‌లో జేమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ వెనుదిరిగాడు. ఐతే, ఆరంభంలో భారత్‌ను గట్టి దెబ్బ కొట్టిన న్యూజిలాండ్‌ బౌలర్లు.. మిడిల్‌ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ జోరును అడ్డుకోలేకపోయారు. భారత ఇన్నింగ్స్‌లో రాహుల్‌, శ్రేయస్‌ భాగస్వామ్యమే హైలెట్‌. 62/3తో జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఏదశలోనూ వెనుకడుగు వేయలేదు. వీరిద్దరూ సంయమనంతో ఆడి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో కుదురుకొని ప్రమాదకరంగా కన్పిస్తున్న అయ్యర్‌ను జిమ్మీ నీషమ్‌ పెవిలియన్‌ పంపాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే దూకుడుగానే ఆడుతూ తనవంతు పాత్ర పోషించాడు. ఇదే క్రమంలో రాహుల్‌ రెచ్చిపోయి ఆడుతూ శతకం పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో రాహుల్‌తో పాటు మనీశ్‌.. బెనెట్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఔటయ్యారు. ఏ స్థానంలోనైనా తాను బ్యాట్‌తో రాణించగలనని రాహుల్‌ మరోసారి నిరూపించాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి..న్యూజిలాండ్‌ గడ్డపై సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రాహుల్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా సురేశ్‌ రైనా(110 నాటౌట్‌) రికార్డు నమోదు చేశాడు.

అనంతరం 297 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌… టీమిండియా నిర్దేశించిన టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి అలవోకగా చేధించింది. ఇక, కివీస్‌ బ్యాటింగ్ విషయానికొస్తే… జట్టుకు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్ శుభారంభాన్ని అందించారు. మార్టిన్ గప్తిల్ 46 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 66 పరుగులు చేయగా, మరో ఓపెనర్ హెన్రీ నికోలస్ 103 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కోల్పోయే లోపు జట్టుకు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మార్టిన్ గప్తిల్ చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ హెన్రీ నికోలస్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. లాథమ్ 32 పరుగులు, డీ గ్రాండ్‌హోమ్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచి న్యూజిలాండ్ జట్టును 48వ ఓవర్ మొదటి బంతికే విజయ తీరాలకు చేర్చారు. 46వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఓవర్‌లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో డీ గ్రాండ్‌హోమ్ విరుచుకుపడ్డాడు. టీమిండియా బౌలర్లలో చాహల్‌కు 3 వికెట్లు, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.