సీఎం కేసీఅర్ అపర భగీరథుడు :ఎమ్మెల్యే రవిశంకర్

సీఎం కేసీఅర్ అపర భగీరథుడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. సీఎం కేసీఅర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంతో తెలంగాణలో… ఇక కరువు శాశ్వతంగా దూరమైందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎత్తి పోతల ద్వారా గోదావరి జలాలు చేరడంతో… స్థానిక రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతుల పంట పొలాలు తడిపేందుకు వడివడిగా తరలి వచ్చిన గంగమ్మకు జల హారతి నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలో పంటలు ఎండిపోకుండా కాపాడాలన్న తన విజ్ఞప్తి మేరకు ఒక్క టీఎంసీ నీటిని విడుదల చేయించిన సీఎం కేసీఅర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ… ఆయనచిత్రపటానికి గోదావరి నీటితో జలాభిషేకం చేశారు.

కాగా.. సీఎం కేసీఅర్ అదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల ప్రారంభించారు. ఒక్కో పంప్ ద్వారా 247 క్యూసెక్కుల చొప్పున రెండు పంపుల ద్వారా నీటి విడుదలవుతోంది. శనివారం రాత్రి వరకు నీరు నారాయణపూర్ రిజర్వాయర్‌కు చేరడంతో తమ పంటలకు ఇక ఢోకా లేదని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నీరందించే విషయంలో చొప్పదండి నియోజకవర్గం వాటర్ జంక్షన్ గా ఉండటం తమకేంతో సంతోషంగా ఉందని తెలిపారు.