అభివృద్ధికి గజ్వేల్ పట్టణం ఒక మోడల్‌…

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్ , వైస్ చైర్మన్లు  సిద్దిపేట జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పట్టణ ప్రగతిపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సు అనంతరం.. వీరంతా గజ్వేల్‌కు తరలి వెళ్లారు. వర్గల్ మండలం సంగాపూర్ సమీపంలోని అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా అటవీశాఖ ఆధ్వర్యంలో అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా పెంచిన చెట్లను పరిశీలించారు. మంత్రి హరీశ్ రావు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ… వీరందికి అవెన్యూ ప్లాంటేషన్ గురించి వివరించారు.

అనంతరం మంత్రులు, కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధుల బృందం నేరుగా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు తరలి వెళ్లారు. రూ. 23 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్మించిన ఈ మోడల్ మార్కెట్‌ను పరిశీలించారు. మార్కెట్‌లో జరుగుతున్న కూరగాయల అమ్మకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అటు ఇదే మార్కెట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాంసం దుకాణాలను పరిశీలించారు. సమీకృత మార్కెట్ నిర్మించిన విధానం, దాని ఫలితాలను మంత్రి హరీష్ రావు వారికి వివరించారు. మార్కెట్‌లో శుభ్రత, ఆరోగ్యపరంగా చేపట్టిన చర్యలను.. తాజా కూరగాయల విక్రయంతోపాటు అమ్మకం దారులు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను తెలిపారు. ప్లాస్టిక్ రహితంగా.. జూట్, పేపర్ బ్యాగులను ప్రోత్సహిస్తూ, కొనుగోలుదారులకు వాటిని అందజేశారు. అనంతరం… గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వైకుంఠధామంను అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అక్కడ కల్పించిన వసతులను మంత్రి హరీశ్ రావు వారికి వివరించారు.

అక్కడి నుంచి నేరుగా అందరూ అర్బన్ పార్కుకు వెళ్లారు. పార్క్ అంతా కలియ తిరిగి… అక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పార్కుకు వచ్చిన ప్రజలతో కాసేపు మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటన తమలో ఎంతో స్పూర్తిని నింపిందని వారంతా చెప్పారు. తమ తమ నియోజకవర్గాల్లోని అన్ని పట్టణాలను ఇలాగే మార్చేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రగతితో పల్లెల్లో ఎంతో మార్పు వచ్చిందన్న వారు.. పట్టణ ప్రగతితో మరెంతో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అంతా కలిసి పని చేస్తే… ఎలాంటి ఫలితాలు సాధించొచ్చొ చెప్పేందుకు గజ్వేల్ పట్టణం ఒక మోడల్‌గా నిలిచిందన్నారు.

గంటన్నరకు పైగా సాగిన ఈ పర్యటన పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసి పర్యటన విశేషాలను వివరిస్తామన్నారు. ఇక, పర్యటనకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందానికి మంత్రి హరీశ్ రావు సాదర స్వాగతం పలికారు. వారందరికి జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, మంత్రి హరీశ్ రావు ప్రత్యేకత కలిగిన చేనేత గొల్లబామ చీరలను ప్రధానం చేశారు.