టీఎఫ్టీ లైసెన్సులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్…

తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కుల వృత్తులకు పూర్వవైభం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండల కేంద్రంలో కల్లుగీత కార్మికులకు టీఎఫ్టీ లైసెన్సులను ఎమ్మేల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ప్రస్తుతం 681 మందికి లైసెన్స్‌లు మంజూరు కాగా… పెండింగ్‌లో ఉన్న మిగతా లైసెన్స్‌లను నెలలోపు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మాట్లాడుతూ…. “ కల్లు వృత్తి పవిత్రమైన వృత్తి. కల్లు మనిషికి చాలా పవిత్రమైన ఔషదం. చెట్టు నమ్ముకొని జీవించే కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వాలు లైసెన్సులు ఇవ్వలేదు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం గీత కార్మికుల కష్టాలను అర్థం చేసుకుంది. గీత కార్మికుడు చనిపోతే ప్రభత్వం తరఫున రూ. 5 లక్షల రూపాయలు అందిస్తున్నది. తాజాగా… గీత కార్మికులకు లైసెన్సులను మంజూరు చేసింది. ఇప్పుడు లైసెన్స్‌లు రాని వారందరికీ వారం రోజుల్లో అందిస్తాం. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను కాపాడింది టీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడేది. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులవృత్తులను ఆదుకుంటున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసి చుక్క నీళ్లు రాకుండా గత ప్రభుత్వాలు చేస్తే.. ఈ ప్రభుత్వం దానిని పునరుద్ధరించి… ఆయకట్టు పరిధిలోని ప్రతీ ఎకరాకు నీటిని అందిస్తున్నాం. అన్ని వర్గాలు వారికి వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి.. ఇద్దరు కేరళ మంత్రులు రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గురించి తెలుసుకున్నారు. మాడ్గుల మండల కేంద్రంలో కచ్చితంగా నీర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. రూ. 10 కోట్లను ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు అందజేశాం. ప్రతి ఒక్కరు చెట్లను నాటి, వాటిని సంరక్షించాలి. ఎవరైనా ఈత, తాటి చెట్లను నరికితే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయండి. వారి మీద కచ్చితంగా చర్యలు తీసుకుంటారు.“ అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.