సీఎం కేసీఆర్ సారథ్యంలో అహర్నిశలు పనిచేస్తాం :మంత్రి నిరంజన్ రెడ్డి

పంచాయతీ రాజ్ చట్టం-2018 ద్వారా 30 రోజుల అభివృద్ధి ప్రణాళికతో… పల్లెలు ప్రగతి సాధించాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇదే తరహాలో పట్టణాల్లోనూ 30 రోజుల ప్రణాళిక అమలు చేసేందుకు… సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం… సీఎం కేసీఆర్ సారథ్యంలో అహర్నిశలు పని చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో పట్టణ ప్రగతిపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గూర్చి ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్య నివారణ వంటి అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మావతి, కలెక్టర్ శ్రీధర్, జాయింట్‌ కలెక్టర్ మనూచౌదరి, తదితరులు పాల్గొన్నారు.