పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత :మంత్రి కేటీఆర్

జనగామలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణ తీరును తనిఖీ చేశారు. మున్సిపాలిటీలోని 13వ వార్డులో కలియ తిరుగుతూ… స్థానికుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి, పారిశుద్ధ్యంపై ప్రజలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి అవగాహన కల్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్… మరిన్ని స్వచ్ఛ్ వాహనాలు అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ.. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ జిల్లా అయిందని గుర్తుచేశారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతోపాటు తండాలను, గూడేలాను పంచాయతీలుగా మార్చి… పాలనను ప్రజలకు దగ్గర చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ప్రత్యేకించి దళిత బస్తీల్లో సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. అన్ని పట్టణాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వార్డు కమిటీలు పారిశుద్ధ్య ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. యువత వార్డు అభివృద్ధిలో భాగమవ్వాలని మంత్రి కోరారు. జనగామంలో ప్రతీ ఇంటికి రెండు చెత్తబుట్టలు అందిస్తమని.. తడి, పొడి చెత్తలను వేరు చేయాలని ప్రజలకు సూచించారు. డంపింగ్ యార్డులోకూడా రెండు రకాల కార్యక్రమాలు చేపడతామన్న మంత్రి.. చెత్తనుకూడా వేర్వేరుగా సేకరించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య వాహనంలో కూడా వేర్వేరు డబ్బాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే.. వేరుగా ఇచ్చిన తడి చెత్తతో… ఎరువులు తయారు చేసి రైతులకు అందిస్తామని తెలిపారు. అటు.. సిరిసిల్ల మున్సిపాలిటీలో పొడిచెత్త నుంచి నెలకు రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.

పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు బతకాలని.. లేకపోతే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం… నాటిన మొక్కలు బతకపోతే ప్రజాప్రతినిధుల పదవులు పోతాయన్నారు. ప్రజలకు కావాల్సిన మొక్కలను నర్సరీల ద్వారా అందజేస్తామని తెలిపారు. పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని చెప్పారు. పట్టణాల్లో వాటర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 6 నెలల్లో విద్యుత్‌ స్తంభాలు, వేలాడే వైర్ల సమస్యలను పరిష్కరించాలి. అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల్లో పందులు లేకుండా చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇక.. పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కడుపులో పడ్డ బిడ్డ నుంచి వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి తెలిపారు.