కేంద్ర ఆర్థికమంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: కేటీఆర్‌

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా, అసంబద్ధంగా ఉందన్నారు తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్ర బడ్జెట్‌పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఇలా వ్యాఖ్యానించడం సవ్యం కాదన్నారు. న్కూఢిల్లీలో టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో ప్రసంగించిన మంత్రి కేటీఆర్… అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్‌ నిరాశాజనకంగా, అసంబద్దంగా ఉందని తెలిపారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానాలు చూశామనీ.. తెలంగాణ రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి పేర్కొన్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 2.70 లక్షల కోట్ల పన్ను ఆదాయంగా చెల్లించామనీ… కేంద్రం మాత్రం రాష్ర్టానికి తిరిగి రూ. లక్షా 15 వేల కోట్లేనని మంత్రి వివరణ ఇచ్చారు. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆదాయానికి, రాష్ర్టానికి ఇచ్చిన ఆదాయానికి దాదాపు రూ. లక్షా 60 వేల కోట్ల వ్యత్యాసం ఉందని మంత్రి తెలిపారు. ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ మనుగడ దెబ్బతినక తప్పదని సూచించారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో తప్ప ఇతర రాష్ర్టాలలో బీజేపీ చాలా బలహీనంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్పే నిజమైన ఫెడరల్‌ స్ఫూర్తితో దేశం నడిచే రోజు త్వరలోనే వస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రాలతో కేంద్రం మరింత ఉదారపూర్వకంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇప్పటికే కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌తో చర్చించామని తెలిపిన మంత్రి.. కేంద్రంతో రాష్ర్టానికి ఉండే సంబంధాలను నెరుపుతూనే అంశాల వారీగా విభేదించామని తెలిపారు. సీఏఏ అంశంలోనూ రాష్ట్రం తరఫున విభేస్తున్నట్లు ప్రకటించామని మంత్రి గుర్తుచేశారు. ఒక రాజకీయ పార్టీగా, రాష్ట్ర ప్రభుత్వంగా సీఏఏను ఎందుకు విభేధించామో వివరంగా తెలిపామని కేటీఆర్‌ అన్నారు. జీఎస్టీ బకాయిలపై సైతం సీఎం కేసీఆర్‌ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారని కేటీర్‌ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని సీఎం డిమాండ్‌ చేశారని మంత్రి పేర్కొన్నారు. చట్టం ప్రకారం ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు మంత్రి అన్నారు.