రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి :మంత్రి కేటీఆర్

ముంబైలో జరుగుతున్న నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ ఫోరమ్ 2020 కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. “ మార్చ్ టూ 5 ట్రిలియన్ డాలర్ ఏకానమీ: రియాలీటీ అర్ అంబిషియస్“ అనే అంశంపైన టెక్ మహీంద్రా ఎండీ సిపి గుర్నాని నిర్వహించిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ నూతన రాష్ట్రమైనప్పటికీ, వేగంగా అభివద్ధి చెంతున్నదని… కేవలం సేవారంగంలోనే కాకుండా మాన్యుఫాక్చరింగ్, వ్యవసాయ రంగంలోనూ దేశ వృద్దిరేటును మించి దూసుకుపోతున్న నేపథ్యంలో తెలంగాణ అనుభవాలను పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ను సిపి గుర్నాని కోరారు. దీంతో పాటు.. దేశం 5 ట్రిలియన్ డాలర్ల అర్ధిక వ్యవస్ధ దిశగా పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన విధానాలపైన చర్చించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి అభిప్రాయాలను అడిగారు.

దేశాభివృద్ది పట్ల అశావాహ దృక్పథంతో ఉన్నానన్న మంత్రి కేటీఆర్.. ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోవాలంటే దైర్యంతో కూడిన వినూత్న నిర్ణయాలను కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయాలనే దేశం అశించిందన్నారు. అయితే, ప్రజల అకాంక్షల మేరకు కేంద్రం నిర్ణయాలు తీసుకోలేక పోయిందన్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా దేశ అర్ధిక వ్యవస్ధ మందగమనంలో ఉన్నదని… కేంద్రం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అర్ధిక గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. కేంద్రం తన శషబిషలు వదిలి రాష్ర్టాలకు మరింత అర్ధిక స్వేచ్చ ఇవ్వాల్సిన సమయం అసన్నమైందన్నారు. రాష్ర్టాలు వేగంగా ఎదిగితేనే దేశం ఏదుగుతుందన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. టీమ్ ఇండియా, ఫెడరల్ వంటి పదాలను అచరణలో చూపాల్సిన సమయమిదన్నారు. వీటితోపాటు ఫిస్కల్ ఫెడరలిజాన్ని అనుసరించాలని సూచించారు. తెలంగాణ లాంటి వేగంగా ఎదుగుతున్న రాష్ర్టాలకు మూలధన లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నదన్న మంత్రి, దేశం వేగంగా అభివృద్ది చెందాలంటే మౌళిక వసతుల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందుకోసం అమెరికా, జపాన్, యూరప్ లోని పలు దేశాల మాదిరి చవకైన మూలధనాన్ని సేకరించి ఖర్చు చేయాలని సూచించారు. తెలంగాణ లాంటి పలు రాష్ట్రాల విధానాలు, వనరులు, వాతావరణం నచ్చి.. పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వీదేశీ కంపెనీలు, అర్ధిక సంస్ధలకు కఠినమైన కేంద్ర నిబంధనలు అడ్డంకులుగా మారాయన్నారు. అభివృద్ది కార్యక్రమాల కోసం భారీగా నిధులను ఖర్చు చేయనప్పుడు 5 ట్రియలియన్ డాలర్ల అర్ధిక వ్యవస్ధ సాధ్యమవడం సవాలేనని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను కేంద్రం సవరించాలని సూచించారు. దేశంలో మౌళిక వసతుల కల్పన కోసం నిధులను సేకరించి ఖర్చు చేస్తే.. అప్పులు పెంచుతున్నారంటూ చేస్తున్న వాదన అత్యంత సంప్రదాయిక అర్ధిక అలోచన అని, అభివృద్ది చెందిన అన్ని అర్ధిక వ్యవస్ధలు పెద్ద ఎత్తున ఖర్చు చేసినందునే అభివృద్ది సాధ్యం అయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

కేంద్ర అర్ధిక నిబంధనల సరళీకరణతోపాటు పలు విధానాల రూపకల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సేవారంగం, టూరిజం, హెల్త్ కేర్, విద్యారంగం మొదలైన రంగాల్లో కేంద్రం పూర్తి స్వేచ్చ రాష్ర్టాలకు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ర్టాలకి బదిలీ చేయాలన్నారు. సులభమైన నిబంధనలు ఉన్నప్పుడే ఇతర దేశాలతో తయారీ రంగంలో భారతదేశం పోటీ పడగలుగుతుందని అభిప్రాయపడ్డారు. మన కన్నా చిన్న దేశాలైన బంగ్లాదేశ్, వియాత్నాంలు ఎలక్ర్టానిక్స్, టెక్స్ టైల్, అప్పారెల్ రంగాల్లో ముందు వరుసలో ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కేంద్రం ప్రారంభించిన మేకిన్ ఇండియా స్లోగన్ కాస్తా అసెంబ్లింగ్ ఇన్ ఇండియాగా మారిందని, తయరీ రంగంలో పూర్తిస్ధాయి తయారీ దిశగా తీసుకు పోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

దేశ అర్ధిక వ్యవస్ధ భారీ వృద్ది చెందాలంటే భారీ ప్రాజెక్టుల అలోచన చేయాలన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ భారీగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు, ప్రపంచంలోనే పలు అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదారాబాద్ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ టెక్స్ టైల్ పార్కుల ఎర్పాటుతో ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. వీటికున్న జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర సహాకారం కోరినా.. ఇప్పటి దాకా ఏమాత్రం మద్దతు ఇవ్వలేదన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను పట్టించుకోలేనప్పుడు భారీ అర్ధిక వ్యవస్ధ ఏర్పాటు లక్ష్యం ఏలా నెరవేరుతుందని ప్రశ్నించారు.

గతంలో ప్రధాన మంత్రితో జరిగిన సమావేశంలో దేశాభివృద్దికి `త్రి ఐ` మంత్రా పాటించాలని సూచించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఇన్నోవేషన్, ఇన్‌ ప్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ ద్వారా నయాభారత్ నిర్మాణం సాధ్యం అవుతుందని తెలిపారు. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ… నూతన అవిష్కరణలు చేయాలని, ఈ రంగంలో తెలంగాణ టీహబ్‌ వంటి భారీ ఇంక్యూబేటర్‌ను నెలకొల్పిందని తెలిపారు. దేశం వేగంగా ఎదుగుతున్నా, ఇన్ ప్రాస్ట్రక్చర్ రంగం మాత్రం అనుకున్న మేర విస్తరించడం లేదన్నారు. ఈ రంగంలో 2014కి ముందు తెలంగాణలో కేవలం సూమారు రూ. 50వేల కోట్లు ఖర్చు చేస్తే… తాము అధికారంలోకి వచ్చిన ఐదు సంత్సరాల్లోనే సూమారు లక్షా రూ. 60వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను చేపట్టి అర్ధిక ప్రగతికి పాటు పడుతున్నామన్నారు. దీంతోపాటు పట్టణాలు, గ్రామాల మధ్య మరింత గ్యాప్ రాకుండా సమాంతరంగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీంతోపాటు వర్క్ ఫోర్స్‌లో మహిళా భాగసామ్యం పెరగాలని… ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన విహబ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఐటీ పరిశ్రమల ప్రతినిధులు హజరైన ఈ చర్చా సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక విజ్జప్తి చేశారు. ఇప్పటికే ప్రముఖ నగరాలన్ని మౌళిక వసతులు సంక్షోభం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరించాలని కోరారు. ఇందుకోసం నాస్కామ్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దీంతో కంపెనీల నిర్వహణ వ్యయం తగ్గడంతోపాటు… అయా నగరాల్లో ఉన్న అద్భుతమైన మేదస్సును, మానవ వనరులను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణలో ద్వీతీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తున్నదని… వరంగల్ నగరానికి ఐటీ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తున్నదని, మరిన్ని కంపెనీలు అక్కడి రావాలని కోరారు.

వ్యవసాయ రంగలో అదాయం రెట్టింపు చేయాలన్న అర్ధిక లక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా ముందుకు పొతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు భీమా వంటి కార్యక్రమలను చేపట్టామన్నారు. ప్రస్తుతం ఈ విషయంలో కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు… తెలంగాణను అదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.