కేంద్రం రాష్ట్రాలను విస్మరించడం సరికాదు :మంత్రి కేటీఆర్

పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూస్తున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్-2020 లో పాల్గొన్న కేటీఆర్… బలమైన రాష్ట్రాల సహకారంతోనే బలమైన భారత్ నిర్మాణమవుతుందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు మద్దతు లభించడం లేదని.. కేంద్రం రాష్ట్రాలను విస్మరించడం సరైందికాదన్నారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీలు అభివృద్ధి చేయలేదన్నారు. జాతీయ పార్టీలకు ప్రజల్లో తగ్గిందన్న ఆయన… రాహుల్ గాంధీ, మోదీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేశామన్న ఆయన.. సీఏఏ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉందన్నారు. టీఆర్ఎస్‌ పార్టీ ఏ జాతీయపార్టీకి బీ టీం కాదన్న మంత్రి… దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయం అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి నిర్ణయాలకు కేంద్రం స్వస్తి చెప్పాలని మంత్రి కేటీఆర్ సూచించారు.