చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌తో మంత్రి కేటీఆర్ భేటీ…

భారతదేశ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌ను గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకున్న చర్యలు, పెట్టుబడుల సేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను, ఈ దిశగా అందుకున్న విజయాలను సుబ్రహ్మణ్యన్‌ కు వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాధాన్యతలను సుబ్రమణ్యన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. గతంలో హైదరాబాద్ `ఐయస్‌బి`లో పనిచేస్తున్న నాటి నుంచి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తో తనకు మంచి బంధం ఉందన్న కేటీఆర్… ఆయన ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.