మార్చి 1న ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన…

సీఎం కేసీఆర్ మానస పుత్రిక.. పట్టణ ప్రగతిని దిగ్విజయం చేయడంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పట్టణాల ముఖచిత్రాన్ని మర్చాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. పట్టణ ప్రగతి ఆవశ్యకతను వివరిస్తున్నారు. దీనిలో భాగంగానే మార్చి1న ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.

ఖమ్మం, ఇల్లందు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన సాగనుంది. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, బాస్కెట్ బాల్ ఇండోర్ స్టేడియం, ఓపెన్ జిమ్‌లు, మినీ ట్యాంక్ బండ్‌ను ఆయన ప్రారంభిస్తారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ… కేసీఆర్ డిగ్నిటీ హోమ్స్ పేరుతో నిర్మించిన 300 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రజలకు అందజేస్తారు. అనంతరం.. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇల్లందులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పట్టణ ప్రగతిపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగేందుకు మంత్రి కేటీఆర్ పర్యటన దోహదపడనుంది. కాగా… కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఖమ్మం అభివృద్ధి జరుగుతోందని అన్నారు. 28న కొత్తగూడెం, 2న మధిర, 2న వైరా, 4న సత్తుపల్లిలో జరిగే పట్టణ ప్రగతిలో పాల్గొంటానని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా… కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టామని, చెత్తా చెదారం తొలగిస్తున్నామని అన్నారు. బల్లేపల్లిలో వైకుంఠధామాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. పబ్లిక్ టాయిలెట్లు, పార్కుల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రజలంతా పెద్దెత్తున మొక్కలు నాటాలని ఆయన కోరారు.