ప్రజలకు ప్రణాళికాబద్ధమైన ప్రగతిని అందించాలి :మంత్రి కేటీఆర్

నూతన మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వం. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కొత్త మున్సిపల్ చట్టంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… “ తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజల కోణంలో నుంచి ఆలోచించి సీఎం కేసీఆర్.. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. సిరిసిల్ల ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ చిన్న కార్యాలయం ఏర్పాటు చేయాలన్నా యుద్ధం చేయాల్సి వచ్చేది. గతంలో కలెక్టర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. సీఎం కేసీఆర్ నిర్ణయం పరిస్థితిని సమూలంగా మార్చింది. సరిగ్గా పనిచేయని, తప్పు చేసిన ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ భాద్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారు. మున్సిపల్‌ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పనిచేయని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.“ అని మంత్రి కేటీఆర్ సూచించారు.

“ అధికారులు ప్రజల పట్ల నిజాయితీగా నడుచుకోవాలి. రూపాయి లంచం లేకుండా, 21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలి. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలి. 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. టీఎస్-బీపాస్, మీ సేవాతో పాటు కొత్తగా మరో యాప్ తీసుకోస్తున్నాం. ఈ మూడు ప్రక్రియల ద్వారా లేదా నేరుగా మున్సిపల్ అధికారులను కలవడంతో.. ఇంటి నిర్మాణ అనుమతి లభిస్తుంది. ప్రజలకు అసంతృప్తి కలగకుండా అధికారులు సమాధానం ఇవ్వాలి. ప్రతీ పౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలి. సీఎం కేసీఆర్ కోరుకునే విధంగా.. పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి. ప్రజలకు ప్రణాళికబద్ధమైన ప్రగతిని అందించాలి. ప్రజలు అసాధారణమైన, గొంతెమ్మ కోరికలేమి కోరడం లేదు. వ్యవస్థీకృత పట్టణాలను ప్రజలు కోరుకుంటున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి కనిపించేలా పట్టణాలను తీర్చిదిద్దాలి. టౌన్ ప్లానింగ్ విషయంలో సీరియస్‌గా ఉండాలి. దాని ద్వారా అత్యుత్తమ పట్టణాలను రూపొందించాలి. టీఎస్-ఐపాస్ గురించి ఎక్కడికి వెళ్లినా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. టీఎస్-బీపాస్‌ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తాం. మార్చి నెలలో టీఎస్-బీపాస్‌లో ఉన్న అన్ని లోటుపాట్లను పరిశీలించాలి. టీఎస్‌ బీ పాస్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలి. అన్ని స్థాయిల అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.“ అని మంత్రి కేటీఆర్ సూచించారు.

“ పల్లె ప్రగతి విజయవంతమైన నేపథ్యంలో.. ఇక పట్టణప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలి. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేయాలి. ఇవాళ్టి నుంచి నాలుగైదు రోజుల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. వార్డు కమిటీల ఏర్పాటులో రాజకీయాలు చేయొద్దు. పట్టణ ప్రగతిని విజయవంతం చేస్తే తెలంగాణ పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి. పట్టణ ప్రగతి కోసం కొనుగోలు చేసే వాహనాలకు స్టిక్కరింగ్‌ చేయాలి.“ అరి మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు.