పెరిగిన వంటగ్యాస్‌ ధర…

వంట గ్యాస్ సిలిండర్ ధర ఆరోసారి భారీగా పెరిగింది. 2019 ఆగష్టు నుంచి ఇప్పటికే ఐదు సార్లు ధర పెరగ్గా… ఈసారి పెద్ద మొత్తంలో పెంచుతూ ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడున్న ధర కన్నా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర దాదాపు రూ. 144.5 పెరిగింది. ఆయా ప్రాంతాలను బట్టి రూ. 149 వరకు పెరగనుంది. తాజా పెరుగుదలతో.. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.858.50 చేరింది. కాగా సబ్సిడీ కింద వినియోగదారులకు ఇచ్చే మొత్తం రూ.153.86 నుంచి 291.48కు పెంచారు. సిలిండర్‌ ధర పెంపుతో వినియోగదారుడిపై అదనంగా 7 రూపాయల భారం పడే అవకాశముంది.

అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలు పెరగడంతోనే భారత్‌లో కూడా ధరలు పెరిగినట్లు సమాచారం. గత ఆగస్టు నుంచి సిలిండర్ ధరను కంపెనీలు ప్రతీ నెల పెంచుతున్నాయి. చివరిసారిగా జనవరి 1న సిలిండర్ ధరను రూ.19 పెంచాయి. కాగా, పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయని కంపెనీలు తెలిపాయి. తాజా పెరుగుదలతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.