ఉమెన్‌ టీ20 వరల్డ్ కప్‌: బంగ్లాపై భారత్ గెలుపు

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లీగ్‌ మ్యాచ్‌ల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు మరోసారి సత్తా చాటడంతో.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ మరో విజయం సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 17 బంతుల్లో 39 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్‌ 37 బంతుల్లో 34 పరుగులతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా లక్ష్య ఛేదన క్రమంలో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/18) తన స్పిన్ తంత్రాన్ని ప్రత్యర్థికి రుచిచూపింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ నిగార్ సుల్తానా నమోదు చేసిన 35 పరుగులు, ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ చేసిన 30 పరుగులే టాప్ స్కోర్లు.