ఉమెన్‌ టీ-20 వరల్డ్‌ కప్‌లో భారత్ శుభారంభం…

ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణీ కొట్టింది. ఇవాళ(శుక్రవారం) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిడ్నీ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో మట్టికరిపించారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో గెలుపు ఆశల్లేని భారత జట్టు పూనమ్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో రేసులోకి రావడమే కాదు, ఆతిథ్య ఆసీస్ ను వారి సొంతగడ్డపైనే చుట్టేసింది. సొంతగడ్డపై ఆడుతున్న ఒత్తిడి ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఉమెన్‌ టీమ్‌పై స్పష్టంగా కనిపించింది.

ఇక.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 రన్స్‌ చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. 4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో.. జోనాసెన్‌ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. దూకుడుగా ఆడి… 15 బంతుల్లో 29 రన్స్‌ చేసింది. 4వ ఓవర్‌లో నాలుగు బౌండరీలు కొట్టి మంచి స్టార్ట్‌ ఇచ్చింది. పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌ అయ్యింది. ఇక, ఏడో ఓవర్‌లో నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్‌ ప్రీత్‌ స్టంప్ ఔట్‌ తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో రోడ్రిగ్స్‌- దీప్తి శర్మల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత రోడ్రిగ్స్‌ వెనుదిరిగింది. కిమ్మిన్సె వేసిన 16 ఓవర్‌ ఆఖరి బంతికి వికెట్లు ముందు దొరికిపోయింది. దాంతో భారత స్కోరు 100 పరుగుల వద్ద ఉండగా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దీప్తి శర్మ స్టైక్‌ రొటేట్‌ చేస్తూ కుదురుగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో భారత్‌ 132 పరుగుల స్కోరును చేయగల్గింది. ఆసీస్‌ బౌలర్లలో జొనాసెన్‌ రెండు వికెట్లు సాధించగా, పెర్నీ, కెమ్మిన్సెలు తలో వికెట్‌ తీశారు.

అనంతరం, 133 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌ను టీమిండియా బౌలర్ పూనమ్ బౌలింగ్ యాదవ్ గట్టి దెబ్బ తీసింది. పూనమ్‌ బౌలింగ్ దాటికి… ఆస్ట్రేలియా బ్యాటింగ్ పేక మేడలా కుప్పకూలింది. చేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలుత విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. అయితే, పూనమ్ యాదవ్ బౌలింగ్‌లోకి దిగాక ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియా వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. అర్ధ సెంచరీ చేసి జోరుమీదున్న అలీసా హీలీ (51)ని తొలుత పెవీలియన్‌కు పంపిన పూనమ్.. ఆ తర్వాత రేచల్ హేన్స్ (6), ఎలీస్ పెర్రీ (0), జెస్ జొనాసెన్ (2)లను పెవిలియన్ పంపింది. తన 4 ఓవర్ల స్పెల్ లో కేవలం 19 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసి కంగారూల పతనంలో ప్రధాన భూమిక పోషించింది. పూనమ్‌కు శిఖా పాండే (3 వికెట్లు) కూడా తోడవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ అలీసా హీలీ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. మిడిలార్డర్ లో ఆష్లే గార్డనర్ 34 పరుగులు చేయడంతో ఆసీస్‌ 115 పరుగుల స్కోర్ చేసింది. ఆసీస్‌ జట్టులో హీలీ, గార్డనర్ మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.