వుహాన్, జపాన్ నుంచి ఢిల్లీకి చేరిన భారతీయులు…

కొవిడ్-19(కరోనా) కలకలం నేపథ్యంలో జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో కొన్ని రోజుల పాటు చిక్కుకున్న భారతీయులతో పాటు మరో ఐదుగురు విదేశీయులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కొవిడ్‌-19 ప్రభావంతో ఫిబ్రవరి 3 నుంచి యోకోహోమా పోర్టులో నిలిపివేసిన ఈ నౌకలోని 3,711 మందిలో 138 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 16 మందికి కరోనా వైరస్‌ సోకగా వారిని జపాన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా 119 మందితో పాటు శ్రీలంక, నేపాల్‌, సౌతాఫ్రికా, పెరూ దేశాలకు చెందిన ఐదుగురిని కూడా గురువారం ఢిల్లీకి తీసుకొచ్చినట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. 119 మంది భారతీయులతో పాటు ఐదుగురు విదేశీయులతో ఎయిరిండియా విమానం టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకుందని ఆయన ట్వీట్‌ చేశారు. భారతీయుల తరలింపుకు సహకరించిన జపాన్‌ అధికార వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిరిండియాకు మరోసారి జైశంకర్‌ ధన్యవాదాలు చెప్పారు.

ఇక, చైనాలోని వుహాన్‌ నుంచి కూడా 112 మందిని భారత్‌కు తరలించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం 76 మంది భారతీయులు, 36 మంది విదేశీయులతో గురువారం ఉదయం ఢిల్లీకి చేరింది. కరోనాతో అతలాకుతలం అవుతున్న చైనాకు సాయంగా.. భారత్‌ 15 టన్నుల వైద్య పరికరాలతో కూడిన ఎయిర్‌ఫోర్స్‌ విమానాన్ని బుధవారం చైనాలోని వుహాన్‌కు పంపింది. తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకున్న 76 మంది భారతీయులు, 36 మంది విదేశీయులను ఢిల్లీకి తీసుకువచ్చారు అధికారులు. వీరందరిని ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు భద్రత దళం ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.