`ఒరేయ్ బుజ్జిగా` ఫస్ట్‌లుక్‌ విడుదల…

హీరో రాజ్‌ తరుణ్‌, దర్శకుడు కొండా విజయ్ కుమార్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారు. ఒక కథానాయికగా మాళవిక నాయర్ కాగా.. మరో కథానాయికగా హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. పోస్టర్‌ను పరిశీలిస్తే… ఇది ఒక అల్లరి ప్రేమకథ అనే విషయం అర్థమవుతోంది. రాజ్ తరుణ్‌ను మాళవిక క్రికెట్ బ్యాట్‌తో కొట్టబోతున్నట్టు.. కత్తితో దాడి చేస్తున్నట్టు సరదా సన్నివేశాలతో ఈ పోస్టర్‌ను రూపొందించారు. ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ నటిస్తుండగా… ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ నరేశ్, పోసాని కనిపించనున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న హీరో రాజ్‌తరుణ్ కు, ఈ సినిమా అయినా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. కాగా.. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది.