పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలు…

కాళేశ్వరం లింక్-2లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ దాకా గోదారమ్మ పరుగులు తీస్తుంది. బుధవారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి జలాశయంలో 12.24 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆరో ప్యాకేజీ ధర్మారం మండలం నంది పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. మూడు రోజులుగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మోటర్లను నడిపిస్తున్నారు. సోమవారం రాత్రి 4 మోటర్లను, మంగళవారం రాత్రి 5 మోటర్లను నడిపించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల నడుమ 15 నిమిషాల వ్యవధిలో 2, 3, 4, 5, 6 నంబర్ల మోటర్లను ఆన్ చేశారు. ఇక్కడి నుంచి జలాలు ఎనిమిదో ప్యాకేజీ రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్ సర్జ్‌పూల్‌కు చేరుతున్నాయి.

సోమవారం రాత్రి 9 గంటల నుంచి బాహుబలి మోటర్లు ఎత్తిపోస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఐదు పంపులు నడుస్తున్నాయి. బుధవారం 1, 2,3,4,7 పంపులను రన్ చేశారు. ఎత్తిపోసిన జలాలు గ్రావిటీ కాల్వ మీదుగా వరద కాల్వకు చేరుకొని, శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి పరుగులు తీస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు సుమారు ఒక టీఎంసీ నీటిని గాయత్రీ పంపుహౌస్ నుంచి ఎత్తిపోసినట్టు అధికారులు తెలిపారు. బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో 24.85 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గాయత్రీ పంపుహౌస్ నుంచి వచ్చిన నీటిని యథాతథంగా ఎల్ఎండీకి వదులుతున్నారు. రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారా బుధవారం 5 వేల క్యూసెక్కుల నీటిని తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎస్సారార్ రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తున్న నీటితో ఎల్ఎండీలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 6,179 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 5,754 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉన్నది. ఎల్ఎండీలో 8.481 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.