శంషాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు వర్మ…!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆ దిశగా సన్నాహాలు వేగవంతం చేశారు. దిశ కథాంశంపై వివరాలను సేకరించడంలో భాగంగా వర్మ సోమవారం శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ ను కలిసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. దిశ ఘటనపై ఆయనతో చర్చలు జరిపిన వర్మ… దిశ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యాచారం ఘటన నుంచి ఎన్‌కౌంటర్ వరకూ జరిగిన విషయాలు, ఉన్న పరిస్థితులు, కేసు వివరాలను ఏసీపీ వివరించారు.

అనంతరం రామ్‌గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. దిశ ఘటనలో వివరాలు తెలుసుకునేందుకు అందరిని కలుస్తున్నా. అయితే, ఎవరిని కలుశాను.? వారినేం అడిగాను..? వారేం చెప్పారనేది ఇప్పడే చెప్పలేను.. వారంతా నాకు సహకరిస్తున్నారు. ఈ సినిమాను వివాదాలతో సంబంధం లేకుండా భావోద్వేగపూరిత కోణాన్ని చూపించాలనేది నా ప్రయత్నం. సినిమా అనేది కళ్లకు కట్టినట్లు చూపించడానికి చేసే ప్రయత్నం. మీడియాలో రిపోర్టు చేసేది ఒక వార్తలాగా వస్తుంది. రెండింటికి తేడా ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు వర్మ. త్వరలో మరికొందరు పోలీస్‌ అధికారులను కూడా కలుస్తానన్న వర్మ.. సమాచారన్నంతా సేకరించిన తర్వాత తాను సినిమాలో ఏం చూపించాలన్న దానిపై నిర్ణయానికి వస్తానన్నారు.