ఢిల్లీ అల్లర్లు: విచారణ ఏప్రిల్ 13కు వాయిదా…

ఈశాన్య ఢిల్లీ అల్లర్లు తగ్గు ముఖం పట్టాయి. కానీ ఘటనను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. రాజకీయ చెయ్యొద్దంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసును విచారించింది ఢిల్లీ హైకోర్టు..విచారణ సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బిజెపి నాయకులపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. అయితే..ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేమని ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.

ఈశాన్య ఢిల్లీ అల్లర్లు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగానే జరిగినట్టు తమకు అనుమానాలున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా అల్లర్లను కొంతమంది ఆర్గనైజ్ చేశారని పోలీసుల కోర్టుకు తెలిపారు. అందుకు సంబంధించి ఇప్పటివరకు 50 మంది ఫోన్లను సీజ్ చేసి..సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిపారు. అటు..అల్లర్లతో సంబంధమున్న130 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసుల కోర్టుకు తెలిపారు. వారిలో 48 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పేర్కొన్నారు. బీజేపీ నేతలపై ఇంకా ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్న కోర్టు ప్రశ్నకు సొలిసిటర్ జనరల్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయన్న సొలిసిటర్ జనరల్ ..ఈ అంశంపై సమాధానమిచ్చేందుకు గడువు కావాలని కోర్టును కోరారు. మెహతా వాదనతో పిటిషనర్ తరఫు న్యాయవాది విభేదించారు. అయితే వాదనలు వినిపించేందుకు ఏప్రిల్ 13వరకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. కేసును నాలుగు వారాలు వాయిదా వేసింది. తిరిగి ఏప్రిల్ 13న వాదనలు వింటామని తెలిపింది. అటు…అల్లర్లతో సంబంధం ఉన్న48 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సొలిసిటర్ జనరల్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు.