సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్…

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం గురువారం అధికారిక ప్రకటన చేసింది. గతంలో దక్షిణాఫ్రికాలో బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో ఏడాది నిషేధానికి గురైన వార్నర్‌ 2018 సీజన్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఏడాది కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలో మెరుపులు మెరిపించాడు. నిషేధం ముగిసినా అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించలేదు. ఈసారి ఫ్రాంచైజీ అతడికి ఓ అవకాశం ఇచ్చి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో 2018, 2019 ఐపీఎల్‌ సీజన్లకు నాయకత్వం వహించిన కేన్‌ విలియమ్‌సన్‌ స్థానంలో వార్నర్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టునున్నాడు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ… సన్‌రైజర్స్‌ టీమ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన మీద నమ్మకంతో జట్టు యాజమాన్యం మరోసారి కెప్టెన్‌గా చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు వార్నర్. తనపై నమ్మకంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి కెప్టెన్‌గా ఎంపిక చేసిందని… వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జట్టును ముందుకు నడుపుతానని తెలిపారు. కాగా ఇంతకుముందు వార్నర్‌ నాయకత్వంలోనే 2016లో సన్‌రైజర్స్‌ జట్టు టైటిల్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.