వేరుశనగకాయల్లో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్, ముఠా అరెస్ట్

ఏ పని చేయాలన్నా ట్యాలెంట్ ఉండాలండీ.. ట్యాలెంట్ ఉండాలి! ఏదో సినిమాలో ఓ హీరో డైలాగ్‌ చెప్తాడు. కానీ, కొందరు తప్పించుకునేందుకు సరికొత్త ప్లాన్స్‌ వేస్తూ… రియల్‌ లైఫ్‌లోనూ తమ ట్యాలెంట్‌ను ప్రూ చేసుకుంటున్నారు. అయితే… ఎయిర్‌ పోర్టుల్లో అక్రమ బంగారం, నగదు పట్టుబడడం సహజం. అదెక్కడ మహా అయితే.. షూ, డ్రెస్‌, మొబైల్ ఫోన్స్‌, ల్యాప్‌ టాప్స్‌ లేదా మరే ఇతర మార్గాల్లో బంగారం తరలింపు చూశాం. కరెన్సీ కూడా ఇలాగే పలు సార్లు పట్టుబడింది. కానీ, ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో బుధవారం పట్టుబడిన మురాద్ ఆలం అనే వ్యక్తి… అక్రమ విదేశీ కరెన్సీ తరలిస్తున్న విధానం చూసి సీఐఎస్ఎఫ్ అధికారులే షాక్‌ అయ్యారు. ఎలా అనుకుంటున్నారు… వేరుశనగకాయ(పల్లికాయ)లో నోట్లను మలిచి, దారాలతో కట్టి మరీ తరలిస్తున్నాడు. ఇది చూసిన పలువురు నోరెల్లబెడుతున్నారు.

ఇక.. కొత్త మార్గం విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న మురాద్ ఆలం అనే వ్యక్తి ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో దుబాయ్‌కి వెళ్లేందుకు యత్నించిన ముఠాను సీఐఎస్ఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వేరు శెనక్కాయలు మాత్రమే కారు.. బిస్కెట్లు, ఇతర తినుబండారాల్లో విదేశీ కరెన్సీని పెట్టి అక్రమంగా అమెరికా, దుబాయ్ తీసుకెళ్లేందుకు నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న వాటిలో 2 లక్షలకు పైగా సౌదీ రియాల్, 1500 ఖతర్ రియాల్, 1200 కువైట్ దినార్ ఉన్నాయి. 300 ఒమన్ రియాల్, 1800 యూరోలను కూడా ఇదే విధంగా మురాద్ తరలించేందుకు యత్నించాడని పోలీసులు తెలిపారు.